Thursday, August 19, 2010

పరస్పరాధారం

"పరస్పరాధారం"


ఓ నేస్తమా,

స్నేహం ఒక పదమైతే ,అది పలికే పెదవులు నాదొకటి,నీదొకటి,

స్నేహం ఒక పాటైతే చరణం నేను,పల్లవి నీవు,

స్నేహం ఒక సంగీతమైతే శ్రుతి నేను,లయ నీవు,

స్నేహం ఒక నాట్యమైతే నర్తించే పాదం నాది,తాళం నీది,

స్నేహం కరతాళధ్వనులైతే,ఆ కరములు నాదొకటి,నీదొకటి,

స్నేహం ఒక నది ఐతే,ఒక దరి నేను,మరొకదరి నీవు.

స్నేహం ఒక సాగరమైతే ఇసుక తీరం నేను, అందాలొలికే కెరటం నీవు,

స్నేహం ఒక ముత్యమైతే, ముత్యపుచిప్ప నేను,
అందు కురిసిన స్వాతి చినుకు నీవు,

స్నేహంలో నీవు లేక నేను లేను, నేను లేక నీవు లేవు,

స్నేహంలో నీవు,నేను "పరస్పరాధారం", మనందరికీ స్నేహమే "జీవనాధారం".




(1992లో కాలేజీ పిక్నిక్ లో తీసుకున్న ఫొటో)


Wednesday, August 18, 2010

ఓ పింకీ

ఓ పింకీ,

లేలేత సూర్యోదయానివా,
సాగర గర్భాన వెలసిన వర్ణాల మంచిముత్యానివా,
హిమతుషారంలో విరిసిన గులాబీవా,
లేక కోటిగులాబీల హారానివా,
దేశాంతర పగడాల దండవా,
సౌభాగ్య , క్షీరాల సంగమానివా,
నిను మనోనేత్రంతో చూసానా, కలిగె ఈ పులకింత,
నిన్నిక ముఖాముఖి కలిసానా,
నాలో ఉప్పొంగే ఆనంద సాగర కెరటాల ధృతి ఎంత?

ఎవరు నీవు?

ఎవరు నీవు?
~~~~~~~~~
కురుల మేఘానివా,

గరళ కంఠుని కంఠానివా,

సాగర గర్భానికి ప్రతిరూపానివా,

హృదయాలను ఆకర్షించే అయస్కాంతానివా,

కావ్యకన్యక కంటి కాటుకవా,

చిట్టిపాప చిక్కటి కనుపాపవా.

ముత్యాలు పొదిగిన కృష్ణ ఛత్రానివా,

కృష్ణ శబ్దానికి అర్ధానివా,

అమావాస్యకు ఉపమానానివా,

వంశీ కథల్లో నల్లసుశీలవా,

గోదారిలో నాటు నావవా,

మానవకన్యగా విహరిస్తున్న నిశీధివా,

ఎవరు నీవు?

నీవెవరైనా గానీ,

నిన్ను చూసాకే నాకు,

నలుపంటే ఇష్టమయింది...

"సంక్షిప్త సందేశం"

"సంక్షిప్త సందేశం"
~~~~~~~~~~
కుహూ కుహూ రాగాలతో నిను చేరతా,
హృదయతంత్రులను మీటుతా,
మనసులకూ గిలిగింతలు పెడతా,
పెదాలపై చిరునవ్వులు పూయిస్తా,
మదిలో మెదిలే భావాలెన్నో మోసుకు వస్తా,
నాలో నవరసాలనూ రంగరిస్తా,
భవ బంధాలనూ రక్షిస్తా,
స్నేహాన్నీ సంరక్షిస్తా,
ప్రేమలనూ పూయిస్తా,
అవునంటే పెళ్ళికూడా చేయిస్తా,
మీ చేతిలో తాళంగుత్తినౌతా,
మీ జేబులో మనీపర్సు నౌతా,
వద్దంటే గాని నిన్ను వదల,
అపుడపుడూ నాలో పొంగే ఒక రాగహేల,
మరెపుడో కూడె ఒక దృశ్యమాల,
చిట్టి చిట్టి పదాలతో నే కూడతా,
నీ అరచేతి లో సంక్షిప్త సందేశాన్నౌతా..

"గోరింటాకు "

"గోరింటాకు "
~~~~~~~~
అలతి మెచ్చిన అలంకారం,

అచ్చ తెలుగు నుడికారం.

మరువలేని సాంప్రదాయం

భారం లేని ఆభరణం,

నీవు లేక , లేదు శుభకార్యం,

మగని మదిదోచే మోహనం,

మరులు గొలిపే సమ్మోహనం,

మా పెరట్లోని గర్వకారణం,

నీకై బాల్యంలో కేరింత,

కాబోయే భాగస్వామికై ఊహల పులకింత,

కన్నెపిల్లల హృదయాల్లో గిలిగింత,

అతివల కరతలాలపై పాలపుంత,

ముత్తైదువల నెరుపు పండించగా,

అంతిమయాత్ర లోనూ నీ తోడు వీడలేముగా ......



Monday, August 2, 2010

శుభోదయం





ప్రియా, శుభోదయం,



రాత్రి నీకు శుభరాత్రి చెప్పలేదేమా అనుకోకు,
నిన్నటి రాత్రి, నీ గదిలో జరిగిన,నీకు తెలియని విషయం చెప్పనా....
నీ పక్క సర్దమని నా చేతులని పంపా,

నీకు జోలపాడమని నా గొంతును పంపా,

నిశ్శబ్దాన్ని పరీక్షించమని నా చెవులను పంపా,

నిశీధి ని పరీక్షించమని నా కన్నులను పంపా,

నీ మేనిపరిమళం చూడాలంటూ, నా నాసిక అంటున్నా,

శ్వాస కోసం , నా తోటే ఉంచా,

కానీ అవన్నీ తిరిగొచ్చి,

నిన్నుచూడగానే,చెప్పినవన్నీ మరిచిపోయామంటూ,

నీ ముఖలావణ్యాన్ని వర్ణించగానే,
నా మనసు ఉండబట్టలేనంటూ ,నీ చెంతకే చేరింది.....
తొందరగా తిరిగి రమ్మని కొంచం కబురు చెప్పవా.......ప్రియా...



(ప్రియురాలి అలక తీర్చడానికి , మరునాడు ప్రియుడు పడే పాట్లు,



T.V.లో చూసిన సీన్ కి కవితారూపం)



Saturday, July 31, 2010

అశ్రునయనం

క్షణ క్షణం నీ ఙ్నాపకాల తోరణం,
మదిలొ మెదిలే ఆ ఙ్నాపకాల తో, నా రణం.
ఆర్తిగా చేరాలని ఆరాటం,
అందీ అందని ద్రాక్ష అని తెలిసీ అగదు ఈ పోరాటం.
విధి చేసె వింతలను చూస్తూ, విస్తు పోయిన వైనం,
మరిక నా దగ్గర మిగిలినదే ఈ అశ్రునయనం.

Friday, July 30, 2010

“స్నేహగీతం”

చిరునవ్వుతో,చిరుజల్లులా పలకరించేది స్నేహం,
దూరాలను కొలవని మధురభావం స్నేహం,
మనసు చేసే వెన్నెలప్రయాణం స్నేహం,
జీవితమనే ప్రయాణం లో దిక్సూచి స్నేహం,
మన మనసు ప్రతిబింబమై నిలిచేది స్నేహం,
మనలోంచి, మనసులోతుల్లోంచి పుట్టేది స్నేహం,
ఎల్లప్పుడూ, నీ తోడు నేనున్నాననేది స్నేహం,
కాలంతో, వసి వాడని కుసుమ సుగంధం స్నేహం,
అంతరంగాలను తడిమేది,తట్టి లేపేది స్నేహం,
రాగ,ద్వేషాలకు,ఈర్ష్యాసూయ లకు అతీతమీ స్నేహం,
ఈ జీవావరణానికి, దేవుడిచ్చిన వర "మీ స్నేహం",
అనునిత్యం మనసుపాడే మౌనగీత "మీ స్నేహం",
ఇదే మన మిత్రావళికి నా “స్నేహగీతం”.



HAPPY  FRIENDSHIP  DAY

Thursday, July 29, 2010

నీ నవ్వు

నీ కళ్ళల్లో కాంతులు చూసి, నా గుండెల్లో దీపావళి,

నీ మోమున మెరిసే మెరుపులు చూసి,నా మనసంతా సంక్రాంతి,

నీ అధరాల ఇంద్రధనువులతో, నాకు నిలువెల్ల హోళీ,

మనసారా నవ్వుతున్న నిన్ను గానీ, చూసానా, నాకిక అన్ని పండుగలూ ఆనాడే.

స్నేహం కోసం


సృష్టిలో తీయనిది స్నేహమని కవులన్నారు
శాకం ఎంత మధురమైన , కొంత దాటితే జిహ్వ ఇక చాలంటుంది.
హద్దులులేని , ఎల్లలుదాటి సాగే ఈ స్నేహ మధురిమ
ఎంతగ్రోలినా ఆ దాహర్తి తీరనిది,ఆ క్షుద్భాద చల్లారనిది.
అందుకే ఈ మనసెప్పుడూ స్నేహం కోసం ఇంకా , ఇంకా అంటుంది

దేశప్రగతి

నిండు చందమామ నా చేతుల్లో ....,

పండు వెన్నెల నా దోసిట్లో .....,

వేల నక్షత్రాలు నా ఒడిలో ....,

భూమ్యాకాశాలు నా కౌగిలిలో ....,

నింగికెగిసాను జోరుల్లో,హుషారుల్లో.......,

నింపాను,ఆనందభాష్పాలు మీ కళ్ళల్లో.....,

దేశప్రగతి మీ ముంగిట్లో.......,

నా అలుపెరగని పయనం రోదసి కక్ష్యల్లో.....,

నా పరిచయం PSLV C-15.

ఈ దేశ శాస్త్రవేత్తల ముద్దు బిడ్డని నేను.



( PSLV విజయ వంతమైన సందర్భంగా)

Tuesday, July 27, 2010

ఈ స్నేహం కాదిది e-స్నేహం..

రెప్పలు ఆర్పని కళ్ళు,


కీ బోర్డ్ పై కదలని వేళ్ళు,


గడియారం లొ భారం గా కదిలే ముళ్ళు,


ఆగి ఆగి వచ్చే ఉశ్వాస నిశ్వాసలు,


పదే పదే రిఫ్రెష్ బటన్ పై క్లిక్కులు,


నేస్తాల మెయిళ్ళ కోసం ఎదురుచూపులు,


అన్నీ కలసి e-స్నేహమాధుర్యానికి సాక్ష్యాలు..


ఈ స్నేహం కాదిది  e-స్నేహం..

కాలేజీ బ్యూటీ , క్లాసుకి వస్తే...





చందమామ ప్రక్కన కూర్చున్నట్టయింది నాకు,

ఆ తరవాతే తెలిసింది అది నీ మోమని,

నీలాకాశం నావెంటే ఉన్నట్టయింది నాకు,

ఆ తరవాతే తెలిసింది అది నీ వోణీయని.

కెంపుల రంగేమిటో తెలిసింది నీ చుబుకం చూసాకే,
గులాబీ రేకలనుకున్నా, కావవి నీ అధరాలట..
చూసే కొద్దీ చూడాలని పించే అందమా,

అందానికే అర్ధం తెలిపే అందమా,ఆనందమా,
వెన్నెలవా, వేకువవా , ఆ రెండూ కలగలిపిన ముగ్ధమోహనమా,
ఈ తరగతికే అలంకారమా,
నీకిదే ఈ భావుకుడి స్వాగతం.